Death After 13 Days

సనాతన ధర్మంలో మరణం తర్వాత 13 రోజులు – మీరు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది? | 13 Days After Death
కొంతకాలం పాటు మనతో గడిపిన వ్యక్తి అకస్మాత్తుగా మనల్ని వదిలి వెళ్ళిపోతాడు. అప్పటివరకు తన సొంతం అనుకున్న కుటుంబాన్ని, డబ్బును, ఆస్తులను, పరువును పదవిని అన్నిటిని వదిలి అందరిని విడిచి వెళ్ళిపోతాడు. అదే చివరి చూపు. చాలా మందికి మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనే డౌట్ ఉంటుంది. అసలు మరణించక ఆత్మ అనేది ఎక్కడికి వెళుతుంది ? నిజంగా యముడు వస్తాడా ? యమలోకానికి వెళ్తామా ? అసలు 13 రోజుల పాటు ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది ?
మనం మన జీవితంలో ఇలాంటి భయంకరమైన సంఘటన చూసే ఉంటాం. మనకు బాగా దగ్గర వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో డెడ్ బాడీని చూసి మనం భయపడుతూ ఉంటాం. అయితే అప్పటికే ఆత్మ ఆ బాడీ నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైతే ఆత్మ శరీరం నుంచి వేరవుతుందో అప్పుడు వెంటనే అది అక్కడి నుంచి వెళ్ళిపోదు. కొన్ని నిమిషాల పాటు అక్కడే ఉంటుందట. మళ్ళీ తిరిగి తన శరీరంలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందట. కానీ అది ఫలించక దూరంగా వెళ్ళలేక ఆత్మ చాలా ఘోషిస్తుంది.
మరోవైపు చనిపోయిన వ్యక్తిని కొత్త బట్టలతో చుట్టి, కాళ్ళు కదలకుండా కట్టి, నోటిలో తులసి రసం పోసి, డెడ్ బాడీని చితికి చేర్చేందుకు దగ్గర వాళ్ళు సిద్ధం చేస్తారు. ఆ తర్వాత గంధపు చెక్కలపై లేదా మామూలు కట్టెలతో చితిని పేర్చి దహనం చేస్తారు. పూర్తిగా కాలే వరకు కుటుంబ సభ్యులు అయితే అక్కడ ఉండరు. కానీ కాటి కాపరి మాత్రం పూర్తిగా కాలేంత వరకు చూస్తాడు. దీన్నే మనం అంతిమ యాత్ర అని పిలుస్తాం. ఆ తర్వాత వరుసగా 13 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తాం. చివరి రోజైన 13 వ రోజు పెద్ద కార్యం చేసి కాకులకు పిండం పెడతారు. అలా కాకులు ఆ పిండాన్ని తినడం వల్ల చనిపోయిన వారి ఆత్మ స్వర్గానికి వెళుతుందని నమ్ముతారు.
ఇది ఇలా ఉంటే అసలు మరణం తర్వాత మనిషి ఆత్మ ఏమవుతుందో తెలుసుకుందాం. సాధారణంగా యముడు వచ్చి శరీరం నుంచి ఆత్మను వేరు చేసి చేస్తాడని, ఆ తర్వాత ఆత్మను తీసుకుని అతను పాపాలు చేస్తే నరకానికి, మంచి పనులు చేస్తే స్వర్గానికి పంపిస్తాడని ఇదంతా సర్వసాధారణం అని నమ్ముతారు. అయితే ఇక్కడ ఈ ఆత్మ ప్రయాణం 13 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 13 రోజులు ఆత్మ అడుగడుగున పరీక్షలు ఎదుర్కొంటూ ముందుకు వెళుతుంది.
కుటుంబ సభ్యులు 13 వ రోజు పెద్ద కార్యం చేసిన తర్వాతే ఆ ఆత్మకు ముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మరికొన్ని పురాణాల ప్రకారం మరణం తర్వాత మూడు గతులు ఉంటాయి. ఉదర్వ గతి, స్థిరగతి, అధోగతి.
మొదటి గతిలో అంటే ఉదర్వ గతిలో మనిషి పరలోకంలో విహరిస్తూ ఉంటారు. ఎవరైతే మంచితనం, నీతి, నిజాయితి, సహాయం చేసే గుణం వంటి లక్షణాలతో బతుకుతారో అలాంటి వారు ఈ గతికి చేరుకుంటారు. ఈ స్థితికి చేరిన వాళ్లకు దేవతల అనుగ్రహం దక్కడంతో పాటు మళ్ళీ మనుషులుగా పుట్టే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ తన వాళ్ళలో ఎవరో ఒకరికి బిడ్డగా జన్మిస్తారు. అంటే ఒక మనిషి తాను చేసిన మంచి పనులను బట్టి ఏ లోకంలోకి వెళ్లి ఉండడు తిరిగి మళ్ళీ భూమిపైకి వచ్చేస్తాడని అర్థం.
ఇక ఎవరైతే తప్పులు చేస్తూ ఉంటారో అంటే అబద్ధాలు, నిజాయితీ లేకపోవడం, మోసాలు చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, బాధ్యతలను విస్మరించి విచ్చలవిడిగా తిరగడం, తల్లిదండ్రులను చూడకపోవడం ఇలాంటివన్నీ ఇలా ఇతరులను బాధపెట్టేవి చేస్తారు. అలాంటి వాళ్ళు అదోగతి స్థితిలోకి వెళ్తారు. ఆ తర్వాత వీళ్ళు క్రిమి కీటకాలుగా, నీటిలో చేపలుగా, కుక్కలు, పిల్లులు, జంతువులుగా పుడతారు ఇదే స్థిరగతి.
అయితే మనిషి చనిపోయాక ఆత్మ దేహం నుంచి వెళ్ళిపోయాక అది ఏ మార్గంలో వెళుతుంది అంటే అది కూడా జీవిత కాలంలో చేసిన పనుల పైనే ఆధారపడి ఉంటుంది. అవి ఎలాంటి మార్గాలు అంటే, అందులో మొదటిది ఉత్పత్తి వినాశన మార్గం. రెండవది అర్చన మార్గం. మూడవది ధూమ మార్గం.
అర్చన మార్గం విషయానికి వస్తే, ఈ దారి దేవలోకంలో సేవలు చేసుకునేందుకు వెళ్లే దారి. ధూమ మార్గం అనేది పెద్దవాళ్ళకు సేవలు చేసుకునేందుకు వెళ్లే దారి. ఇక ఉత్పత్తి వినాశన మార్గం నరకానికి వెళ్లే దారి. ఆత్మలన్నీ కొంతకాలం వివిధ మార్గాల్లో తిరగడం పూర్తయ్యాక, తిరిగి మృత్యు లోకంలోకి రావాల్సి ఉంటుంది. ఇక్కడే చాలా ఆత్మలు పూర్తిగా నాశనం అయిపోతూ ఉంటాయి.
యజుర్వేదం ప్రకారం మనిషి మరణించాక అతని ఆత్మ దేహం నుంచి విడిపోయి బ్రహ్మ లోకానికి వెళుతుంది. బ్రహ్మలో ఆ ఆత్మ కలిసిపోతుంది. మంచి పనులు చేసిన వ్యక్తులు స్వర్గానికి వెళతారు. స్వర్గానికి వెళ్ళటమే కాదు వాళ్ళు దేవతలుగా కూడా మారొచ్చు. కానీ తప్పుడు పనులు చేసిన వాళ్ళు అలాగే కొంతకాలం ప్రేతాత్మలుగా తిరుగుతారు. అందులో కాస్త మంచి వాళ్ళు మళ్ళీ పునర్జన్మ పొందుతారు. పునర్జన్మ పొందిన వాళ్ళు మనిషిగా పుట్టాలని ఏం లేదు. ఏ జీవి రూపంలోనైనా జన్మించొచ్చు. ఇలాంటి వారు చనిపోయిన 13 రోజుల తర్వాత యమపురికి వెళ్తారు.
గరుడ పురాణం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం చెప్పారు అదేంటంటే వైతరణి నది. ఈ నది ఎప్పుడూ చీము, నెత్తులతో పారుతూ ఉంటుంది. గోవులను ప్రేమగా చూసుకున్న వాళ్ళు చనిపోయిన తర్వాత, మనిషి ఈ వైతరణి నదిని సునాయాసంగా దాటి యమపురికి వెళ్తాడట. లేదంటే ఈ నదిలో పదే పదే పడిపోతూ ఉంటాడట. ఒకవేళ పైకి లేచిన యమదూతలు వారిని ఆ నీటిలోకి తోసేస్తూ ఉంటారు. అలా అక్కడి నుంచి యమపురి దగ్గరికి చేరుకున్నాక ఆత్మ పుష్ప పదం అనే మరో కాలువను దాటాల్సి ఉంటుంది. ఆ నది అందమైన కలువ పువ్వులతో స్వచ్ఛమైన నీటితో ఉంటుంది. ఈ నీటి దగ్గర ఉండే కొలను దగ్గర ఉండే చెట్టు దగ్గర ఆత్మ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటుందట. ఆ సమయంలోనే పిల్లలు చేసే పిండదానం ఈ ఆత్మ తింటుందట. ఇలా తిన్న తర్వాత ఆత్మ తిరిగి అక్కడే శక్తిని పుంజుకుంటుంది.
ఈ కొలను దాటిన తర్వాత యమలోకంలోకి అడుగు పెట్టాలంటే నాలుగు ద్వారాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాలుగు ద్వారాలు ఏంటంటే దక్షిణ వైపు ఉన్న ద్వారం నుంచి పావులను లోపలికి పంపుతారు. వీళ్ళంతా యమధర్మరాజు నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ పాటించకపోతే ఇక్కడ వందేళ్ల పాటు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది.
అయితే దాన ధర్మాలు చేసిన వాళ్ళు, నిత్యం సత్యం మాట్లాడే వాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు, తీర్థయాత్రలు చేసిన వాళ్ళు ఇలా వీళ్ళంతా పశ్చిమ ద్వారం నుంచి లోపలికి వెళ్తారు. అమ్మా నాన్నలకు సేవలు చేసిన వాళ్ళు, నిత్యం సత్యం మాట్లాడే వాళ్ళు, అహింసను ఆచరించిన వాళ్ళు ఉత్తర ద్వారం వైపు నుంచి వెళతారు.ఇక ఋషులు, యోగులకు మాత్రం దక్షిణ ద్వారం స్వాగతం పలుకుతుంది. ఇదే స్వర్గ మార్గం అన్నమాట. ఈ ద్వారంలోకి అడుగు పెట్టగానే దేవతలు, గంధర్వులు స్వాగతం పలుకుతారని పురాణాలు చెబుతున్నాయి.
మరికొన్ని పురాణాల ప్రకారం చూస్తే ఒక మనిషి మరణించగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడని, కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి వారికి తమ పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంటుందని అంటారు. కొద్దిమందికి మాత్రమే తమ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఒక మనిషి మరణించాక 12 రోజుల తర్వాత యమలోకానికి ప్రయాణం కడతాడు. స్వతహాగానే గాలిలో తేలుతూ పైకి వెళ్తారు. ఎక్కడైతే ఆగుతారో అక్కడే వారికి యమదూతలు కనిపిస్తారు, పైకి వెళ్ళడానికి సహకరిస్తారు.
ఒక మనిషి చేసిన పనులు, వారి స్థితిని బట్టి వారి ఆత్మ ఎటువైపు పయనించాలనేది నిర్ధారణ అవుతుంది. పెద్దలు చెప్పే ఇలాంటి కొన్ని మాటలు చెవికి ఎక్కించుకుంటే చాలు మనిషి తన జీవితంలో తప్పులు చేయకుండా ఆగుతాడు. ప్రతి మనిషి తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, దేవుళ్ళకు భయపడితే పాపాలు చేయకుండా జీవించగలిగితే ఎదుటి మనిషికి సహాయపడగలిగితే కచ్చితంగా గొప్పవాడవుతాడు, చనిపోయిన తర్వాత కూడా.